Friday, May 12, 2017

గో రక్షణ అంటే మన రక్షణే..

గో రక్షణ అంటే మన రక్షణే..


ప్రభుత్వాలు రసాయన ఎరువుల కోసం దేశవ్యాప్తంగా ఇచ్చే సబ్సిడీలో సగం (50%) సేంద్రియ వ్యవసాయానికి కేటాయిస్తే మన రైతులు అద్భుత ఫలితాలను సాధిస్తారు. ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు, సర్వేజనా స్సుఖినోభవంతు’ అన్న మనమే ‘సంఘే శక్తిః కలౌయుగే’ (కలియుగంలో కలిసి చేసే ఏ పని అయినా అత్యంత శక్తి వంతమైనది) అని తెలుసుకుందాం. గో మాత రక్షణకు అందరం కలిసి ఉద్యమిద్దాం. గోరక్షణ అంటే మన రక్షణే.
అఖిల ప్రపంచానికి గోవు తల్లి వంటిది. 200 కోట్ల సంవత్సరాల సృష్టి చరిత్రలో మానవ సంస్కృతీ వికాసాన్ని ప్రభావితం చేసింది గోవు. పాడి-పంట, ఆరోగ్యం, సంస్కృతి, పర్యావరణ సంరక్షణ వీటన్నింటి వికాసానికీ ఉపయోగపడింది మన గోమాత.
హైందవ నాగరికత సాధించిన గో-విజ్ఞానాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత మానవులందరిపైనా ఉంది.
గోవు – సంక్షేమం
రోజూ కొంత సేపు ఆవు చుట్టూ తిరిగితేనో లేక ఆవుతో గడపడం వల్లో మనిషిలోని అస్తమా, అనీమియా, బిపి, ఆందోళన, హృదయ రోగాలు వంటివి నివారణ అవుతాయి. ఇటువంటి శక్తి ఈ భూమిపై మరే ఇతర జంతువుకు లేదు. ఈ విషయాన్ని భారతీయులు పరిశోధించి తెలుసుకొన్నారు.
భూమికి గోవుకీ ఒక దివ్యానుబంధం ఉంది. గోవు ‘చరిస్తూ’ పేడ, మూత్రం వేస్తూంటే భూమాత పులకరిస్తుదంట. గోవు క్షేమమే భూమికి రక్ష. గోవులు క్షోభిస్తే భూమికి సంక్షోభమే. వాటి ఆక్రందనల వల్లే పెను ఉత్సాతాలు సంభవిస్తున్నాయని పెద్దల మాట. గోవు సంతోషంగా తిరుగుతుంటే భూమిపై ఉన్న మనం క్షేమంగా ఉంటాం. ఇదీ పెద్దల మాటే.
గోరక్షణ మతాంశం కాదు
గో సంరక్షణను మతాంశంగా చూడరాదు. గో సంపద, వాటి భద్రత విషయంలో ఉదాసీన, అలక్ష్య వైఖరి పనికిరాదు. ఇది మానవ జాతి సంక్షేమం కోసం చేపట్టవలసిన అత్యవసర చర్య.
ఒకవైపు విజ్ఞాన వేత్తలూ, మరొక వైపు వ్యవసాయ నిపుణులు, ఇంకొక వైపు ధార్మిక వేత్తలు ముక్త కంఠంతో ‘భారత దేశీయ గోజాతి’ ని రక్షించాలని చెపుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఆవు పాలు ‘అమృతం’ అని పండితులు చెపుతారు.
గోవును మాంసం కోసం వధించటం అమాయకత్వం, అజ్ఞానం, దుర్మార్గం, దేశద్రోహం.
మిగతా ప్రపంచం దృష్టిలో ఆవు ఒక జంతువు మాత్రమే. మనకు మాత్రం పవిత్ర గోమాత. అందుకే ఈ దేశంలో గోసంరక్షణ కోసం వందల సంత్సరాలుగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎందరో మహాత్ములు తమ సర్వశక్తులు ధారపోశారు.
బ్రిటిష్‌ నుంచే..
భారతదేశాన్ని నిర్వీర్యం చేసి, తన పరిపాలనను పెంచుకోవటానికి బ్రిటిష్‌ వారు కుటిల రాజనీతితో భారతీయ ఆర్థిక వ్యవస్థ కేంద్ర బిందువైన ఆవును, విద్యా వ్యవస్థనూ దెబ్బతీశారు. 1760లో, రోజుకు కొన్ని వేల పశువులను వధించగల గోవధ శాలను కలకత్తాలో ప్రారంభించాడు. అయినా ప్రజలకు భయపడి, బాహ్య ప్రపంచానికి కనపడకుండా, రహస్యంగా నడిపారు. గోవధ అంశమే 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి తెరలేపిన విషయం అందరికీ తెలిసిందే.
1947 వరకూ దేశం మొత్తంలో 350 గోవధశాలలే ఉన్నాయి. కానీ ప్రస్తుతం దేశం మొత్తంలో 35 వేల గోవధ శాలలున్నాయని సమాచారం. వధ శాలలకు ప్రతి రోజూ లక్షల పశువులు తరలి వెళ్తున్నాయి.
1940లోనే గో ఆధారిత వ్యవసాయంతో, ఎకరానికి 54 క్వింటాళ్ళు వరిపంట ఉత్పత్తి అయ్యేది.
మన నాయకుల మాటలు
గోవధను నివారిస్తామంటూ మన నాయకులు స్వాతంత్య్రానికి పూర్వం నుండీ ఎన్నో ప్రతిజ్ఞలు చేశారు. అయితే అవన్నీ చేతల్లోకి మాత్రం రాలేదు.
– బాలగంగాధర్‌ తిలక్‌ : స్వాతంత్య్రం వచ్చిన 5 నెలల్లోనే ఒక్క కలం పోటుతో (శాసనంతో) గోహత్య నిలిపేస్తాం.
– మహాత్మాగాంధీ (గార్డియన్‌ దినపత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో) : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే గోవధ శాలలన్నీ మూసివేస్తాం.
– జవహర్‌లాల్‌ నెహ్రూ : ‘నేను ప్రధానమంత్రిని అయితే పశువధ శాలలన్నీ మూసేయిస్తాను.
– కస్తూర్బా గాంధీ : నేను మృత్యువునైనా స్వీకరిస్తాను గానీ, గో మాంసంతో తయారైన ఔషధమును సేవింపను.
– ఆచార్య వినోబాభావే : సంపూర్ణ గోహత్యా నిరోధమే ప్రజల ఆజ్ఞ. దీనికి ప్రధానమంత్రి అంగీకరించక తప్పదు.
– డా|| రాజేంద్రప్రసాద్‌ కమిటీ రిపోర్ట్‌ (30.09.1949) : పశువధ కోసం ఇతర ప్రాంతాల నుండి కోల్‌కతా నగరానికి పశువులను దిగుమతి చేయరాదు. ‘హరిన్‌ ఘట్టా’ నగరం అందరికీ పాలు సరఫరా చేయగల కాలనీగా రూపొందాలి.
– 12 ఏప్రిల్‌ 1979 లోక్‌సభ : ‘ఏ వయస్సు అయినా సరే గోవుల్ని, దూడల్ని, ఎద్దుల్నీ చంపడాన్ని సంపూర్ణంగా నిషేధించాలనే తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది.
ఇన్ని ప్రయత్నాలు జరిగినా వాటి ఫలితాలను మనం ఇప్పటికీ పొందలేకపోయాం.
స్వాతంత్య్రానంతరం బ్రిటిష్‌ చదువులు చదివిన భారతీయులే మన పాలకులైన కారణంగా మనదేశంలో గోవధ నిషేధం గురించి ఇప్పటికీ ప్రయత్నాలు చేయవలసి వస్తోంది.
కొందరు కుతర్కంతో బర్రె మాత, గొర్రె మాత, పంది మాత, గాడిద మాత అంటూ వాటికే పరిమితమైతే, మనకేమీ అభ్యంతరం లేదు.
కొన్ని స్వార్థ శక్తులు దేశంలో ప్లాస్టిక్‌ బియ్యం, జిగురు పాలు, ప్రమాదకర రసాయనాలతో పండించిన కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, నూనెలు, మందులూ సరఫరా చేస్తూ సమాజాన్ని రోగాల పాలు చేస్తున్నారు.
ఆవు – అభివృద్ధి
ప్రతీ ఇంట్లో ఆవును పోషించడం ద్వారా
– గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ తద్వారా ఇంధన వనరులు, పెట్రోలియం, విద్యుత్‌ ఖర్చు తగ్గుదల జరుగుతుంది.
– గో ఆధార వ్యవసాయం ద్వారా ఖర్చులేని, విషరసాయనాలు లేని ఆరోగ్యకర ఆహారం ఉత్పత్తి అవుతుంది.
– చిన్న చిన్న అవసరాలకు సాంకేతికత అవసరం లేని రవాణవ్యవస్థ, ప్రతి ఇంట్లో పుష్కలమైన పాడి, పంటలతో ఆరోగ్య పరిరక్షణ, రోగాల ఉపశమనానికి పెట్టే విపరీతమైన ఖర్చుల తగ్గుదల, మంచి జాతి పాడి పశువుల అభివృద్ధి, తద్వారా చక్కని ఆర్థికాభివృద్ధి జరుగుతుంది.
ఈనాడు పాలను ఎ1, ఎ2 విటమిన్‌లుగా నిర్ణయించి ప్రపంచం ఒక అవగాహనకు వచ్చేసింది. పూర్తి అనారోగ్య కారకమైన, ప్రమాదకరమైన ఎ1 జెర్సి పాలకంటే – రోగాలను పోగొట్టగలిగే శక్తి ఉన్న ఎ2-భారతీయ దేశీ ఆవు పాలు శ్రేష్ఠమైనవి అని తెలుసుకుంది. అందుకే ఆ పాలకు ఎ1, ఎ2 పేర్లు పెట్టారు.
ఆస్ట్రేలియాలో భారతీయ దేశీ ఆవు పిడకలు, ఆవు నెయ్యితో చేసిన ¬మకుండంలోని బూడిద కూడా మంచి ఎరువుగా, క్రిమి సంహారిణిగా ఉపయోగించి, చక్కని దిగుబడిన సాధించిన సఫల ప్రయోగాలు కనిపిస్తున్నాయి.
భూమిలో పడిపోయిన నీటి శాతాన్ని పెంచటానికి పాలిచ్చే భారతీయ దేశీ ఆవు ద్వారా ప్రయోగాలు జరుగుతున్నాయి.
భారతీయ దేశీ ఆవు నుండి లభించే పంచగవ్యములతో రోగాలు రాకుండా, ఇప్పటికే ఉన్న దీర్ఘకాల రోగాలను నివారించే  ఔషధాలు తయారవు తున్నాయి.
ప్రభుత్వాలు రసాయన ఎరువుల కోసం దేశవ్యాప్తంగా సబ్సిడీ క్రింద 2 లక్షల కోట్ల రూపాయలు పైనే వెచ్చిస్తున్నాయి. దీనిలో సగం (50%) సబ్సిడీ క్రింద సేంద్రియ వ్యవసాయానికి కేటాయిస్తే మన రైతులు అద్భుత ఫలితాలను సాధిస్తారు.
గోరక్షణ మన రక్షణే
‘ఇంట్లో ఆవు ఉంటే లక్ష్మీప్రదం’ అని మన శాస్త్రాలు చెప్పిన విషయం  సరైనదే అనేది నేడు కనిపిస్తున్నది. కనుక ‘లోకాస్సమస్తా సుఖినోభవంతు, సర్వేజనా స్సుఖినోభవంతు’ అన్న మనమే ‘సంఘే శక్తి కలియుగే’ (కలియుగంలో కలిసి చేసే ఏ పని అయినా అత్యంత శక్తి వంతమైనది) అని తెలుసుకుందాం. మన గో మాత రక్షణకై అందరం కలిసి ఉద్యమిద్దాం.
గోరక్షణ అంటే మన రక్షణే. మన ఆరోగ్యం, సంస్కృతి, దేశ రక్షణే.
 – ఆకుతోట రామారావు, తెలంగాణ ప్రాంత గోసేవా ప్రముఖ్

Sekarana: shri sivaraama krishna gaaru

No comments: